Robbers Steal 40 Lakh: ట్రాఫిక్ లో రూ.40 లక్షలు కొట్టేశారు.. ఇదిగో వీడియో!
- ఢిల్లీలో బ్యాగులో డబ్బు పెట్టుకుని బైక్ పై వెళ్లిన వ్యక్తి
- గమనించి అనుసరించిన ముగ్గురు దొంగలు
- సిగ్నల్ దగ్గర బైక్ ఆగగానే.. వెనుక నుంచి చోరీ
- బ్యాగ్ జిప్ తీసి డబ్బు ఎత్తుకెళ్లిన వైనం
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
దొంగలు మరీ తెలివి మీరిపోతున్నారు. ఇళ్లకు, బ్యాంకులకు కన్నాలు వేయడం కాదు.. వందల మంది మధ్యలోనే చోరీలకు పాల్పడుతున్నారు. అదను చూసి క్షణాల్లోనే లక్షలు దోచేస్తున్నారు. అయితే దొంగతనం ఎంత ఈజీగా చేస్తున్నారో.. అంతే ఈజీగా దొరికిపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో చోటుచేసుకుంది.
మార్చి 1న సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర్లో ఓ వ్యక్తి బ్యాగులో డబ్బు పెట్టుకుని, బైక్ పై వెళ్లడాన్ని ముగ్గురు దొంగలు గమనించారు. బైక్ ను కొంతదూరం అనుసరించారు. దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ ఆగగానే.. బ్యాగు జిప్ ను తెరిచి డబ్బు మొత్తం తీసుకుని ఉడాయించారు. అది కూడా రూ.వెయ్యి.. రూ.పది వేలు కాదు.. ఏకంగా రూ.40 లక్షలు. బ్యాగ్ ను వెనుక వైపు భుజానికి తగిలించుకుని ఉండటంతో.. దొంగల పని సులువైంది.
వెనుక ఇంత జరుగుతున్నా.. అసలేమీ పట్టనట్లు బైకర్ కూర్చోవడం గమనార్హం. బైక్ రెండు పక్కలా కార్లు ఉన్నా.. చుట్టుపక్కల జనం ఉన్నా.. దొంగలు క్షణాల్లోనే తమ పని పూర్తిచేసుకుని వెళ్లిపోయారు. ఏ ఒక్కరూ ఈ దొంగతనాన్ని గమనించకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. రూ.38 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు ఇలా బైక్ లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారని చెప్పారు.