Telangana: మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం: కేటీఆర్
- సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో వ్యాఖ్యలు
- వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని వెల్లడి
- 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయన్న కేటీఆర్
తెలంగాణలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అద్భుతమైన వాతావరణం ఉందని చెప్పారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇటీవల హైదరాబాద్ లో బయో ఆసియా సదస్సును విజయవంతంగా నిర్వహించామన్నారు.
‘రాబోయే ఎన్నికల్లో మళ్లీ మాకు ఓటేయండి. మీ నుండి వస్తున్న స్పందన చూస్తే మళ్లీ అధికారంలోకి వస్తాం అనిపిస్తుంది. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్విహిస్తాం’ అని పేర్కొన్నారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయన్నారు. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని కేటీఆర్ తెలిపారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరానికి ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 9 బిలియన్ టీకాలు హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్లోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో అతి పెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామనీ, దేశానికే హైదరాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుందని కేటీఆర్ చెప్పారు.
ఫార్మా పరిశ్రమలకు ఒకే చోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని, సుల్తాన్పూర్ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక, ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముందుచూపుతో రాష్ట్రంలో ఈవీ, బ్యాటరీల తయారీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.