Ravi Shankar Prasad: మాతృదేశాన్ని రాహుల్ గాంధీ అవమానిస్తున్నారు: రవిశంకర్ ప్రసాద్
- దేశ అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యాన్ని కోరుతున్నారని మండిపాటు
- రాహుల్ వ్యాఖ్యలను సోనియా, ఖర్గే సమర్థిస్తారా అని ప్రశ్న
- ఆరెస్సెస్ ఒక జాతీయవాద సంస్థ అని వ్యాఖ్య
మాతృదేశాన్ని అగౌరవపరిచేలా విదేశాల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. మన దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, న్యాయ వ్యవస్థలను అవమానించేలా లండన్ లో మాట్లాడారని అన్నారు. మన దేశ అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యాన్ని కోరుతున్నారని మండిపడ్డారు. భారత్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ జోక్యం చేసుకోవాలని రాహుల్ కోరడం బాధ్యతారాహిత్యమని అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలను సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఒకవేళ సమర్థించకపోతే... రాహుల్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఆరెస్సెస్ ను ముస్లిం బ్రదర్ హుడ్ తో రాహుల్ పోల్చడం దారుణమని అన్నారు. ఆరెస్సెస్ ఒక జాతీయవాద సంస్థ అని చెప్పారు. మావోయిస్టు ఆలోచనా విధానం ఉచ్చులో రాహుల్ చిక్కుకున్నారని విమర్శించారు.