BJP: త్రిపుర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ‘మిస్టర్ క్లీన్’
- ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మాణిక్ సాహా
- బాధ్యతలు చేపట్టిన 8 మంది మంత్రులు
- అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు 32 గెలిచిన బీజేపీ
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం గవర్నర్ ఎస్ఎన్ ఆర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాణిక్ తో పాటు 8 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలిచి మరోసారి అధికారం నిలబెట్టుకుంది. ‘మిస్టర్ క్లీన్’గా పేరున్న మాణిక్ సాహా టౌన్ బర్దోవాలి స్థానం నుంచి 1,257 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అశిశ్ కుమార్ సాహాపై విజయం సాధించారు.
ఈ క్రమంలో రెండోసారి కూడా త్రిపుర ముఖ్యమంత్రి పీఠం మాణిక్ సాహానే వరించింది. మాణిక్ సాహా 2022లోనే త్రిపుర ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 2018లో మూడు దశాబ్దాల వామపక్షాల పాలనను ముగించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. తొలుత సీఎంగా బిప్లవ్ కుమార్ దేవ్ కు అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. కానీ, ఆయన తీరు వివాదాస్పదం కావడంతో బీజేపీ అధిష్ఠానం మాణిక్ సాహాను 2022లో సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.