Australian: నేటి నుంచి భారత్ లో ఆస్ట్రేలియా ప్రధాని పర్యటన
- 11 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు పర్యటించనున్న ఆస్ట్రేలియా బృందం
- పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు
- అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటనలు
భారత్, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం దిశగా అడుగులు పడనున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ నాలుగు రోజుల పర్యటన కోసం నేడు భారత్ కు విచ్చేస్తున్నారు. తిరిగి ఈ నెల 11న ఆయన తన పర్యటన ముగించుకుని వెళతారు. భారత్ లో ఆస్ట్రేలియా ప్రధాని పర్యటించడం ఆరేళ్ల తర్వాత ఇదే మొదటిసారి.
ఆంటోనీ అల్బనీస్ తోపాటు, ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫారెల్, వనరుల మంత్రి మెడ్లీన్ కింగ్, ఉన్నతాధికారుల బృందం భారత్ కు రానుంది. భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియా ప్రధాని ట్విట్టర్ లో పలు ట్వీట్లు చేశారు. ‘‘నేను ఈ రోజు మంత్రులు, వ్యాపార నేతలతో కూడిన బృందాన్ని భారత్ కు తీసుకెళుతున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నాం. భారత్ తో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇదొక చరిత్రాత్మక అవకాశం’’ అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో అరుదైన ఖనిజాల అన్వేషణకు సంబంధించిన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల జాయింట్ వెంచర్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఆస్ట్రేలియలో పెట్టుబడులు పెట్టనుంది.
- బుధవారం సాయంత్రం 4.10 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఆస్ట్రేలియా ప్రధానితో కూడిన ఉన్నత స్థాయి బృందం చేరుకుంటుంది. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.
- 5.20 గంటలకు రాజ్ భవన్ లో జరిగే హోలీ కార్యక్రమంలో పాల్గొంటారు.
- 9వ తేదీన ముంబై పర్యటనకు వెళతారు.
- 10వ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమానికి హాజరవుతారు.
- 11న తిరుగు ప్రయాణం అవుతారు.