Khushbu: నేనెందుకు సిగ్గుపడాలి.. నాపై దారుణానికి పాల్పడిన వ్యక్తి సిగ్గుపడాలి: ఖుష్బూ
- ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఖుష్బూ
- ఈ విషయాన్ని చెప్పినందుకు తాను సిగ్గు పడటం లేదని వ్యాఖ్య
- ప్రతి ఒక్కరూ తమకు ఎదురైన వేధింపుల గురించి మాట్లాడాలని సూచన
ఇటీవలే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన సినీ నటి ఖుష్బూ తన తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు తనపై తన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఆమె మరోసారి స్పందించారు.
ఈ విషయాన్ని బయటకు చెప్పినందుకు తాను ఏమాత్రం సిగ్గుపడటం లేదని అన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని తాను నిజాయతీగా అందరికీ తెలిసేలా చెప్పానని తెలిపారు. తనపై దారుణానికి పాల్పడిన వ్యక్తి దీనికి సిగ్గు పడాలని అన్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి తాను సమయం తీసుకుని ఉండొచ్చని... అయితే ప్రతి ఒక్కరూ తమకు ఎదురైన వేధింపులను బయటకు చెప్పి, తమ ప్రయత్నాన్ని కొనసాగించాలని సూచించారు. తనకు 15 ఏళ్లు వచ్చినప్పుడు ఆయనకు ఎదురు తిరగడం ప్రారంభించానని... తనకు 16 ఏళ్లు రాకముందే ఆయన తమను వదిలి వెళ్లిపోయాడని చెప్పారు.