Air India: బంగారం స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా సిబ్బంది అరెస్ట్
- హ్రెయిన్-కోజీకోడ్-కొచ్చి విమానం కేబిన్ క్రూలో పనిచేస్తున్న షఫీ
- మొత్తం 1487 గ్రాముల బంగారం పట్టివేత
- మరో ఘటనలో 6.8 కిలోల బంగారం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది ఒకరు అధికారులకు చిక్కారు. 1487 గ్రాముల బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించిన షఫీని కస్టమ్స్ అధికారులు బుధవారం కొచ్చి ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. బహ్రెయిన్-కోజీకోడ్-కొచ్చి విమానం కేబిన్ క్రూలో పనిచేస్తున్న షఫీ బంగారం తీసుకొస్తున్నట్టు అధికారులకు విశ్వసనీయ సమాచారం అందడంతో అతడిని అరెస్టు చేశారు. బంగారం ఉన్న ప్లాస్టిక్ కవర్లను చేతికి చుట్టుకుని ఫుల్ స్లీవ్స్ కింద దాచి స్మగ్లింగ్ చేయాలనుకున్న షఫీ పథకం పారలేదు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.
మరో ఘటనలో కస్టమ్స్ అధికారులు 6.8 కేజీల బంగారాన్ని అక్రమరవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు విమాన ప్రయాణికులను అరెస్టు చేశారు. సింగపూర్ నుంచి వచ్చిన ఆ ఇద్దరినీ చెన్నై ఎయిర్ పోర్టులో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.3.32 కోట్లని తెలిసింది. నిందితులు ఇద్దరు ఎయిర్ ఇండియాకు చెందిన రెండు వేర్వేరు విమానాల్లో వచ్చారని అధికారులు తెలిపారు. బంగారం అక్రమ రవాణాకు సంబంధించి తమకు అందిన సమాచారం అధారంగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు చెన్నై కస్టమ్స్ అధికారులు ట్వీట్ చేశారు.