Pakistan: ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి.. పాక్ పై నిప్పులుచెరిగిన భారత్
- జమ్మూకశ్మీర్ పై బిలావల్ బుట్టో జర్దారీ అనుచిత వ్యాఖ్యలు
- భారత్ పై బురదజల్లే ప్రయత్నమంటూ తిప్పికొట్టిన జగ్ ప్రీత్ కౌర్
- తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాక్ ప్రజల గురించి ఆలోచించాలని హితవు
పొరుగుదేశాలపై బురదజల్లే కార్యక్రమానికి ఇకనైనా స్వస్తి చెప్పి సొంత ప్రజల కష్టాలను తీర్చే మార్గం చూడాలని పాకిస్థాన్ కు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జగ్ ప్రీత్ కౌర్ సూచించారు. తమ దేశంలో ప్రజాస్వామ్యం లేదని స్వయంగా పాక్ ప్రజలే ఆరోపిస్తున్నారని ఆమె గుర్తుచేశారు. ఆ దేశంలో మతపరమైన మైనారిటీలు స్వేచ్ఛగా బతికే పరిస్థితిలేదని ఆరోపించారు. టెర్రరిస్టులను పెంచి పోషించిన చరిత్ర పాకిస్థాన్ కు ఉందని చెప్పారు.
ఓవైపు ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో ప్రజలు తిండి దొరకక అల్లాడుతుంటే, గోధుమ పిండి కోసం కొట్టుకుంటుంటే వారి కష్టాలను తీర్చే మార్గం వెతకాల్సింది పోయి పక్క దేశాలపై బురదజల్లుతున్నారంటూ పాక్ విదేశాంగ కార్యదర్శి బిలావల్ భుట్టో జర్దారీపై మండిపడ్డారు. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోవాలని, పౌరుల గురించి ఆలోచించాలని ఐక్యరాజ్యసమితిలో జగ్ ప్రీత్ హితవు పలికారు.
కశ్మీర్ ను భారత్ ఆక్రమించిందంటూ బిలావల్ భుట్టో జర్దారీ తాజాగా మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. దీనిపై జగ్ ప్రీత్ ఘాటుగా స్పందించారు. సొంత ఇంటిని చక్కదిద్దుకోవడం మానేసి పాకిస్థాన్ తమ దేశంపై బురదజల్లుతోందని మండిపడ్డారు. మానవహక్కుల ఉల్లంఘన విషయంలో పాకిస్థాన్ ముందు ఉంటుందని, ఆ తర్వాతే ఎవరైనా అంటూ ఎద్దేవా చేశారు.
టెర్రరిస్టులను చేరదీసి, వారికి శిక్షణ ఇచ్చి అటు ఆఫ్ఘనిస్తాన్ కు, ఇటు భారత భూభాగంపైకి పంపించడం పాక్ కు అలవాటేనని ఆరోపించారు. జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారత భూభాగంలోనివేనని, వాటిని విడదీయాలనే ప్రయత్నాన్ని సాగనివ్వబోమని జగ్ ప్రీత్ తేల్చిచెప్పారు.