Italy town: తప్పు చేసిన రాజకీయ నేతలను చెక్క బోనులో బంధించి, నదిలో ముంచుతారు.. ఇటలీలోని ట్రెంటో పట్టణంలో వింత ఆచారం
- హామీలు నెరవేర్చకుంటే శిక్ష అనుభవించాల్సిందే!
- రాజకీయ నేతలు తమ తప్పు దిద్దుకోవాలనే ఈ పద్ధతి
- ఏటా జూన్ లో టోంకా పేరుతో వేడుకలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా అలవికాని హామీలిచ్చి ఆ తర్వాత వాటిని అటకెక్కించే రాజకీయనాయకులను మనం చూస్తూనే ఉన్నాం.. కానీ ఇటలీలోని ఓ పట్టణంలో అలా చేస్తే జనం ఊరుకోరు. మాట తప్పిన రాజకీయ నాయకుడు శిక్ష అనుభవించాల్సిందే అని పట్టుబడుతారు. ఏడాది పొడవునా తప్పులు చేసిన రాజకీయ నాయకులను గుర్తించి వారిని శిక్షించేందుకు జూన్ లో ఓ వేడుక నిర్వహిస్తారు. టోంకాగా పిలిచే ఈ వేడుకలో నాయకులను శిక్షించే పద్ధతి కూడా వెరైటీగా ఉంటుంది.
తమ బాగోగులు చూడడానికి ప్రజలు ఎన్నుకున్న నాయకులు బాధ్యతారహితంగా ప్రవర్తించినా, ప్రజాసేవ మరిచినా.. తర్వాతి ఎన్నికలలో ప్రజలు వారిని ఓడిస్తారు. ప్రపంచంలో జరిగేది ఇదే.. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజలకే జవాబుదారీగా ఉండాలని ఇటలీ ప్రజలు అంటున్నారు. బాధ్యతలు మరిచిన నేతలకు వాటిని గుర్తుచేయాల్సిన బాధ్యత కూడా ప్రజలదేనని చెబుతున్నారు.
ఇటలీలోని ట్రెంటో అనే పట్టణంలో ఏటా జూన్ లో ఓ వింత వేడుక జరుగుతుంది. ఇచ్చిన హామీలను నెరవేర్చని నేతలను, తప్పుచేసిన రాజకీయ నాయకులను శిక్షించడమే ఈ వేడుక ఉద్దేశం. టోంకాగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో నాయకులను చెక్కబోనులో బంధిస్తారు. ఆపై వాటిని క్రేన్ సాయంతో సమీపంలోని నదిలో ఒక్క క్షణం పాటు ముంచి పైకి తీస్తారు. ఈ తతంగమంతా జరిగేది కాసేపే అయినా రాజకీయ నాయకులు తమ తప్పొప్పులు తెలుసుకోవడానికి, ప్రజలకు జవాబుదారీగా నడుచుకోవడానికి ఇలా చేస్తామని స్థానికులు చెబుతున్నారు. ఈ శిక్షా కార్యక్రమాన్ని వారు కోర్ట్ ఆఫ్ పెనింటెన్స్ గా పిలుచుకుంటారు. పట్టణంలోని ప్రముఖులను ఈ కోర్టులో విచారించి, తప్పుచేసిన వాళ్లకు శిక్ష విధిస్తారు.