IRCTC: ఈ వేసవిలో లడఖ్ ను చుట్టొద్దామా.. ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
- ఏడు పగళ్లు, ఆరు రాత్రులతో కొత్త ప్యాకేజీ రెడీ
- మే 4న హైదరాబాద్ నుంచి యాత్ర ప్రారంభం
- విమానంలో లేహ్ కు.. అక్కడి హోటళ్లలో బస
- ట్రెక్కింగ్, సాహస క్రీడలతో పాటు ప్రసిద్ధ ప్రదేశాలను చూడొచ్చు
ఈ వేసవిలో లడఖ్ ను చుట్టిరావాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడు పగళ్లు, ఆరు రాత్రుల పాటు కొనసాగే ఈ టూర్ లో లడఖ్ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలను తిప్పి చూపించనున్నట్లు తెలిపింది. ఈ టూర్ లో లడఖ్ లోని ప్రకృతి అందాల్లో సేదతీరొచ్చు.. ట్రెక్కింగ్, సాహస క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా అనేకం ఉన్నాయని ఐఆర్సీటీసీ పేర్కొంది. హైదరాబాద్ నుంచి మే 4న మొదలయ్యే ఈ టూర్ వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ చూడండి.. లడఖ్ టూర్
శంషాబాద్ విమానాశ్రయం నుంచి లేహ్ కు విమాన ప్రయాణంతో పర్యటన ప్రారంభమవుతుంది. లేహ్ లోని హోటళ్లలో బస, ప్రయాణ బడలిక తీరేందుకు కాస్త విశ్రాంతి. ఆపై లేహ్ చుట్టూ ఉన్న పర్వతాలు, లోయలలోని అందమైన దృశ్యాలు, అందమైన తెల్లని గోపురం గల బౌద్ధ స్థూపం, శాంతి స్థూపం సందర్శన. పురాతన ఆశ్రమాలు హేమిస్, థిక్సే, షేలతో సహా అనేక ఇతర అందమైన ప్రదేశాలను దర్శించవచ్చు.
నుబ్రా లోయ, పాంగోంగ్ సరస్సు, ఖర్దుంగ్ లా పాస్ లను పలకరించి సహజ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. సాహస క్రీడలపై ఆసక్తి ఉన్నవారు రివర్ రాఫ్టింగ్, కామెల్ రైడింగ్ , ఏటీవీ రైడ్ తదితర గేమ్ లను ఎంజాయ్ చేయొచ్చు. లేహ్-లడఖ్ చుట్టూ ఉన్న అందమైన లోయలు, పర్వతాల్లో ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా ఈ టూర్ లో భాగమేనని ఐఆర్సీటీసీ అధికారులు చెబుతున్నారు.
ప్యాకేజీ ధర.. (విమాన ఛార్జీలు, వసతి, భోజనం, సైట్ సీయింగ్ అన్నీ కలిపి)
- ఒక్కరికి (స్పెషల్ రూం) రూ.54,500
- ఇద్దరికి (షేరింగ్) రూ.47,830
- 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.45,575
- 2 నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు రూ.41,750