USA: వింత బ్యాంకు దోపిడీ.. పట్టుపట్టి మరీ పోలీసులను పిలిపించుకున్న దొంగ

Man accused of robbing Utah bank of 1 dollar demanding to go to federal prison

  • ఒక డాలర్‌ ఇవ్వాలంటూ సిబ్బందిని మర్యాదగా అడిగిన దొంగ
  • పోలీసులను పిలవాలంటూ మంకుపట్టు
  • కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జైలుకే తరలించాలని వినతి

అమెరికాలో తాజాగా ఓ వింత దోపిడీ వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో కేవలం ఒక డాలర్ మాత్రమే దోచుకున్న ఓ దొంగ ఉద్యోగులను బలవంతం చేసి మరీ పోలీసులను పిలిపించుకున్నాడు. అంతేకాదు.. తనను అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని జైలుకే తరలించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. యూటా రాష్ట్రంలోని సాల్ట్ లేక్ నగరంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడిని 65 ఏళ్ల డొనాల్డ్ శాంటాక్రోస్‌గా గుర్తించారు. 

తొలుత బ్యాంకులోకి ప్రవేశించిన డొనాల్డ్ ఒక డాలర్ ఇవ్వాలంటూ క్యాషియర్‌ను మర్యాదగా డిమాండ్ చేశాడు. ‘‘ఇలా చేస్తున్నందుకు ఏమనుకోవద్దు. నేను బ్యాంకు దోపిడీకి వచ్చా. నాకు ఒక డాలర్ ఇవ్వు’’ అని సిబ్బందిలో ఒకరిని బెదిరించాడు. డొనాల్డ్ కోరినట్టే ఒక డాలర్ ఇచ్చిన క్యాషియర్ అతడికి వెళ్లిపోవాలని సూచించారు. కానీ.. తాను వెళ్లేది లేదని తేల్చి చెప్పిన డొనాల్డ్‌ పోలీసులను పిలవాలంటూ సిబ్బందికి సూచించాడు.

 ఆ తరువాత బ్యాంకు లాబీలో కూర్చుని పోలీసుల కోసం ఎదురు చూడసాగాడు. వారు రావడంలో కొంచెం జాప్యం జరగడంతో డొనాల్డ్ అసహనం వ్యక్తం చేశాడు. సిబ్బంది చాలా లక్కీ అని, తన వద్ద గన్ను లేకపోవడంతో ఎస్కేప్ అయ్యారని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో బ్యాంకు మేనేజర్ సిబ్బందిని, కస్టమర్లను మరో గదికి తరలించి నిందితుడున్న గదికి తాళం పెట్టారు. ఆ తరువాత పోలీసులు వచ్చి డొనాల్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో డొనాల్డ్ తన వద్ద ఉన్న డాలర్ నోటును పోలీసులకు అప్పగించాడు. బ్యాంకు దోపిడీ చేసేందుకే వచ్చానంటూ నేరం అంగీకరించాడు. 

అంతేకాకుండా.. తనను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జైలుకే తరలించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. రాష్ట్ర ప్రభుత్వంలోని జైలుకు తరలిస్తే విడుదలయ్యాక మళ్లీ బ్యాంకు దోపిడీకి దిగుతానని హెచ్చరించాడు. కాగా..  ప్రస్తుతం నిందితుడిని సాల్ట్ లేక్ కౌంటీ మెట్రో జైల్లో ఉంచినట్టు తెలుస్తోంది. వీధుల్లో నివసించే నిందితుడు కూడు, గూడు కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధమై ఉంటాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

USA
  • Loading...

More Telugu News