Suspected Spy Pigeon: కాళ్లకు కెమెరా, మైక్రోచిప్ తో ఒడిశాలో నిఘా పావురం?

Suspected Spy Pigeon With Devices Fitted On Leg Caught Off Odisha Coast

  • పావురం కాళ్లకు పరికరాలు ఉండటాన్ని గుర్తించిన మత్స్యకారులు
  • పట్టుకుని పోలీసులకు అప్పగింత
  • గూఢచర్యం కోసమే పావురాన్ని ఉపయోగిస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు 

చైనా నిఘా బెలూన్ల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అమెరికా మాత్రమే కాదు చాలా దేశాలపై బెలూన్ల ద్వారా చైనా నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. ఇదింకా చల్లారక ముందే.. ఒడిశా తీరంలో నిఘా కోసం పంపినట్లుగా భావిస్తున్న పావురం మత్స్యకారుల కంటపడింది.

కాళ్లకు చిన్న కెమెరా, మెక్రోచిప్‌తో తీరంలో పావురం చక్కర్లు కొట్టడాన్ని జగత్‌సింగ్‌పూర్‌లోని పారాదీప్ తీరంలో  స్థానిక మత్స్యకారులు గమనించారు. దీంతో ఆ పావురాన్ని పట్టుకుని పారాదీప్ మెరైన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. గూఢచర్యం కోసమే దాన్ని ఉపయోగిస్తున్నారా? అనే కోణంలో అనుమానిస్తున్నారు.
 
‘‘పావురం కాళ్లకు కొన్ని పరికరాలు కట్టి ఉండటం గమనించాను. నాకు దగ్గరగా రాగానే పట్టుకున్నాను. రెక్కలపై ఏదో రాసి ఉంది. అయితే అది ఒడియా కాదు. నాకు అర్థం కాలేదు. అందుకే అధికారులకు అప్పగించాను’’ అని సారథి ఫిషింగ్ సంస్థ ఉద్యోగి పీతాంబర్ బెహెరా చెప్పాడు. 

పావురాన్ని పరీక్షించిన పోలీసులు.. రెక్కపై కోడ్ నంబర్‌తో మెసేజ్ ఉన్నట్లు గుర్తించారు. పావురాన్ని వైద్యులు పరీక్షిస్తున్నారని.. దాని కాళ్లకు అమర్చిన పరికరాలను పరిశీలించేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సహాయం తీసుకుంటామని జగత్‌సింగ్‌పూర్ ఎస్పీ రాహుల్ తెలిపారు.

‘‘పావురం ఎక్కడి నుంచి వచ్చింది? కాలికి మైక్రో చిప్ అమర్చాల్సిన అవసరం ఏంటి? దాని వెనక ఏమైనా ఉగ్రవాద చర్యలు ఉన్నాయా? లేక పక్షి పరిశోధన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారా? అనే పూర్తి వివరాల కోసం దర్యాప్తు జరుపుతున్నాం’’ అని ఎస్పీ వెల్లడించారు. గూఢచార్యం కోసం పావురాన్ని ఉపయోగించే విషయాన్ని కొట్టివేయలేమని, ఆ దిశగానూ విచారణ చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News