mlc kavitha: నాకేం భయం.. 11న విచారణకు హాజరవుతా: ఎమ్మెల్సీ కవిత

I did nothing wrong then why should i scare asks BRS Mlc Kavitha
  • 9న విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపిందన్న కవిత 
  • రేపు ధర్నా కార్యక్రమం ఉండడంతో సమయం కోరానని వెల్లడి
  • అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబిస్తానని చెప్పిన ఎమ్మెల్సీ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ విషయంలో తనకెలాంటి సంబంధంలేదని తెలంగాణ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ జరిపినా తనకు ఇబ్బందిలేదన్నారు. కేసుతో తనకు సంబంధంలేదని, తనకేం భయంలేదని చెప్పారు. కేంద్ర విచారణ సంస్థలకు 100 శాతం సహకరిస్తానని, అధికారులు అడిగే ప్రశ్నలు అన్నింటికీ జవాబిస్తానని వివరించారు. ఈమేరకు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత గురువారం మీడియాతో మాట్లాడారు.

లిక్కర్ కేసులో ఈ నెల 9న విచారణకు రావాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి తనకు నోటీసులు అందాయని చెప్పారు. ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాలని ఈ నెల 2వ తేదీనే నిర్ణయించామని, ఆ కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షించాల్సి ఉండడంతో కొంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ నెల 15న విచారణకు హాజరవుతానని చెప్పినా ఈడీ అధికారులు అంగీకరించలేదన్నారు. దీంతో ఈ నెల 11న విచారణకు వస్తానని చెప్పినట్లు కవిత తెలిపారు.

1996 నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లోనే ఉందని, కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దానికి మోక్షం కలగడంలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో తగిన మెజారిటీ ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని మెదీ మర్చిపోయారని ఆరోపించారు.

2018లోనూ మరోమారు ఈ బిల్లును పాస్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయినా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని కవిత విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికీ సమయం ఉందని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికైనా పాస్ చేయాలని కోరారు. ఈ విషయంలో కల్పించుకోవాలని, బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు చొరవ చూపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.
mlc kavitha
BRS
Delhi Liquor Scam
Enforcement Directorate
Enquiry

More Telugu News