manish sisodia: సిసోడియాను చంపేందుకు కేజ్రీవాల్ కుట్ర చేస్తున్నారా?: బీజేపీ నేత మనోజ్ తివారీ
- తీహార్ జైలులో సిసోడియా ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆప్ ఆందోళన
- ఢిల్లీ సర్కారు పరిధిలోని జైలులో ఆయన ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుందన్న మనోజ్ తివారీ
- సిసోడియాకు గట్టి భద్రత ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు విజ్ఞప్తి
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న మనీశ్ సిసోడియా ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలపై బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీ జైళ్లు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకే వస్తాయని, మరి సిసోడియా ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుందని ఎదురు ప్రశ్నించింది. సిసోడియాకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.
‘‘అరవింద్ కేజ్రీవాల్ రహస్యాలు ఆయన సన్నిహితుడైన మనీశ్ సిసోడియాకు బాగా తెలుసు. సీక్రెట్లు బయటపడకుండా సిసోడియాను చంపేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నుతున్నారా?’’ అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ సర్కారు పరిధిలో ఉన్న జైలులో సిసోడియా ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుంది? బీజేపీ నుంచే ముప్పు ఉందంటూ అపోహలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిసోడియాకు సాధ్యమైనంత గట్టి భద్రత ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అయితే ఆయన భద్రతపై ఆప్ ఆందోళన వ్యక్తంచేసింది. తీవ్రమైన నేరాలు చేసిన ఖైదీలు ఉన్న చోట సిసోడియాను ఉంచారని, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన జైలు అధికారులు.. సిసోడియా భద్రతను దృష్టిలో ఉంచుకునే జైలు నంబర్ 1లో ఉంచామని తెలిపారు.