Amaravati: అమరావతి రైల్వే ప్రాజెక్టులో కదలిక.. పట్టాలెక్కించేందుకు అధికారుల యత్నాలు!

Vijayawada Railway Decided to continue Amaravati Railway Project
  • అమరావతి రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం
  • 2017-18 కేంద్ర బడ్జెట్‌లో రూ. 2,800 కోట్ల కేటాయింపు
  • ఆ తర్వాత సర్వే కూడా పూర్తి
  • ప్రభుత్వం మారిన తర్వాత మూలనపడిన ప్రాజెక్టు
  • ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్‌ను చేపట్టాలని తాజాగా నిర్ణయం
  • విజయవాడ రైల్వే లైన్‌ కింద సొంతంగా చేపట్టే యోచన
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధాని అమరావతితో కనెక్టివిటీ కోసం ప్రతిపాదించిన అమరావతి రైల్వే ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిని పట్టాలెక్కించాలని విజయవాడ రైల్వే అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారడంతో దానిపై ఒత్తిడి తగ్గించడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి రైల్వే ప్రాజెక్టును చేపట్టాలని యోచిస్తున్నారు. అంతేకాదు, విజయవాడ రైల్వే లైన్ కింద దీనిని సొంతంగా చేపట్టాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించి రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు కోసం కొంత మొత్తం కేటాయించారు. ఆ తర్వాత సర్వే ప్రక్రియ కూడా పూర్తయింది. విజయవాడ-గుంటూరును అమరావతి మీదుగా అనుసంధానించాలని నిర్ణయించి రూ. 2,800 కోట్ల అంచనా వ్యయంతో ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. అంతేకాదు, 2017-18 బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు. అయితే, ఏపీలో ప్రభుత్వం మారడం, రాజధానిపై స్పష్టత లేకపోవడంతో ఈ ప్రాజెక్టు కాస్తా అటకెక్కింది.

అమరావతి రైల్వే లైన్ కోసం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల మేర సింగిల్‌ లైన్ ను ప్రతిపాదించారు. అలాగే, దీనికి అనుసంధానంగా అమరావతి నుంచి పెదకూరపాడు వరకు 25 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్, సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వరకు 25 కిలోమీటర్ల సింగిల్ లైన్, కృష్ణా నది మీదుగా 3 కిలోమీటర్ల మేర నూతన బ్రిడ్జి నిర్మాణం వంటివి ప్రతిపాదించారు.

ఈ ప్రాజెక్టులన్నింటికీ కలిపి రూ. 2,800 కోట్లు కేటాయించారు. అయితే, ఈ ప్రాజెక్టులో మిగతా వాటిని పక్కనపెట్టి ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు 28 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ చేపట్టాలని రైల్వే ఏడీఆర్ఎం డి.శ్రీనివాసరావు వెల్లడించారు.
Amaravati
Amaravati Railway Project
Vijayawada Railway Division

More Telugu News