China: జిన్‌పింగ్ సరికొత్త చరిత్ర.. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నిక!

Chinas Xi Jinping Elected As President Record Third Time

  • ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్లమెంట్
  • చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్‌గానూ
  • మావో జెడాంగ్ తర్వాత శక్తిమంతమైన నాయకుడిగా గుర్తింపు
  • బతికున్నంత వరకు జిన్‌పింగే అధ్యక్షుడు! 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చరిత్ర సృష్టించారు. వరుసగా మూడోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 3 వేల మంది ఉన్న చైనా రబ్బర్ స్టాంప్ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) జిన్‌పింగ్‌ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అధ్యక్ష పోటీలో మరొకరు లేకపోవడంతో జిన్‌పింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ‘రాయిటర్స్’ తెలిపింది. అలాగే, చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్‌గానూ జిన్‌పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. 

ఝావో లెజీ పార్లమెంట్ నూతన చైర్మన్‌గా, హాన్ ఝెంగ్‌ నూతన ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలోనూ వీరిద్దరూ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలోని జిన్‌పింగ్ బృందంలో ఉన్నారు. గతేడాది అక్టోబరులో జిన్‌పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయ్యారు. వరుసగా ఎన్నికవుతున్న ఆయన పార్టీపై పట్టు పెంచుకుంటున్నారు. ఫలితంగా మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 

ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోవాలి. దేశానికి ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా పనిచేయాలన్న నిబంధనను 2018లో జిన్‌పింగ్ ఎత్తివేశారు. ఫలితంగా ఆయన రిటైర్ అయ్యే వరకు లేదంటే మరణించే వరకు, లేదంటే బహిష్కృతయ్యే వరకు ఆయనే చైనా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News