YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ కు సెక్యూరిటీ పెంచాలి.. ఏమైనా జరగొచ్చు.. పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నాయి: విష్ణుకుమార్ రాజు
- అవినాశ్ రెడ్డికి సీబీఐ అంటే భయం పట్టుకుందన్న విష్ణురాజు
- వీరికి రోడ్డు ప్రమాదం కూడా జరగొచ్చని వ్యాఖ్య
- ఏపీలో కొనసాగుతున్న పాలనపై కేంద్రం దృష్టి సారించాలని సూచన
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ హైదరాబాద్ కు షిప్ట్ అయినప్పటి నుంచి విచారణ వేగం పుంజుకుంది. మరోవైపు ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ అంటేనే భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈరోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అవినాశ్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉందని విష్ణుకుమార్ రాజు అన్నారు. జరగకూడనివి జరిగే అవకాశం ఉందని, మొత్తం వ్యవహారాన్ని పక్కదోవ పట్టించే అవకాశం కూడా ఉందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. వీరికి సెక్యూరిటీ పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరుతున్నానని చెప్పారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ బాగా జరిగిందని తాను అన్నమాట నిజమేనని... ఇదే సమయంలో సమ్మిట్ ముసుగులో భూములు కొట్టేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పాననే విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఒప్పందాల వెనుక క్విడ్ ప్రోకో ఉందా? లేదా? అనే విషయం తేలాల్సి ఉందని అన్నారు.
వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 32 మంది ఎమ్మెల్సీలు ఉన్నారని... వీరిలో ఎవరికైనా దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం మనదే అని చెప్పగలిగే ధైర్యం ఉందా? అని విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు. ఏపీలో కొనసాగుతున్న పాలనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. డబ్బులిచ్చి ఓట్లు కొనడం మినహా వైసీపీ నేతలకు మరేమీ తెలియదని చెప్పారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు.