Telangana: డిగ్రీలో ఇంజినీరింగ్ సబ్జెక్టులు: తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం
- బీఎస్సీలో కంప్యూటర్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టులు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
- తొలి విడతలో 10 డిగ్రీ కాలేజీల ఎంపిక
తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ డిగ్రీలో కూడా ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. దీని కోసం తొలి విడతగా 10 డిగ్రీ కాలేజీలను ఎంపిక చేశారు. అంతేకాదు, ఈ కోర్సుల కోసం ముందుకు వచ్చే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు కూడా అనుమతిని ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ సబ్జెక్టుల బోధన ప్రారంభంకానుంది. బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టులు రానున్నాయి.
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ యూనివర్శిటీల వీసీలు హాజరయ్యారు. ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపరిచే అంశంపై వీరు చర్చించారు. ఈ సమావేశంలోనే డిగ్రీలో ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.