heat: మార్చిలోనే 54 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఈ వేసవిలో ఇక చుక్కలే!

Parts Of Kerala Experiencing Heat Index Above 54 Degrees

  • కేరళలో పలు చోట్ల 54 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు 
  • గతంలో అక్కడ 40-45 డిగ్రీలు మించని ఎండ
  • మార్చి రెండో వారంలోనే 50 డిగ్రీలు దాటడంతో ఆందోళన 

దేశంలో ఎండల తీవ్రత ఎక్కువైంది. గతానికి భిన్నంగా చాలా ప్రాంతాలలో మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. పచ్చదనం ఉట్టిపడే కేరళలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. మార్చి రెండో వారంలోనే వేసవి తాపం ఎక్కువైంది. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గురువారం రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో 54 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు, వడ దెబ్బ అవకాశాలను సూచిస్తుంది. వేసవిలో ఎండ 45 డిగ్రీలు దాటితేనే జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. అలాంటి మార్చిలోనే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు కేరళనే కాకుండా దేశం మొత్తానికి ప్రమాద సంకేతాలుగా చెప్పొచ్చు. 

గురువారం తిరువనంతపురం జిల్లాలోని అలప్పుజా, కొట్టాయం, కన్నూర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో 54 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలుస్తోంది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్‌లోని ప్రధాన ప్రాంతాలలో కూడా గురువారం 45 నుంచి 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలకు మించవు. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని, ఎండ నుంచి రక్షించుకోవడంతో పాటు ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News