RCB: ఆర్సీబీ మళ్లీ ఢమాల్... వరుసగా నాలుగో పరాజయం!
- డబ్ల్యూపీఎల్ లో కొనసాగుతున్న బెంగళూరు వైఫల్యాలు
- యూపీ వారియర్స్ చేతిలో దారుణ భంగపాటు
- 10 వికెట్ల తేడాతో ఓడించిన యూపీ
డబ్ల్యూపీఎల్ లో అత్యధిక ధర పొందిన క్రికెటర్ స్మృతి మంధన కెప్టెన్ గా ఉన్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, హీదర్ నైట్, రిచా ఘోష్ వంటి ప్రపంచస్థాయి క్రికెటర్లు ఉన్న జట్టు అది. కానీ, ఇప్పటివరకు టోర్నీలో గెలుపు రుచిచూడలేదు.
ఇవాళ యూపీ వారియర్స్ తో మ్యాచ్ లోనూ బెంగళూరు అమ్మాయిలు ఓడిపోయారు. అన్ని రంగాల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ఆధిపత్యం కనబర్చిన యూపీ వారియర్స్ 10 వికెట్ల తేడాతో నెగ్గడం విశేషం.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమనిపించింది. 139 పరుగుల లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ ఒక్క వికెట్ కోల్పోకుండా కేవలం 13 ఓవర్లలోనే విజయభేరి మోగించింది.
ముఖ్యంగా, ఓపెనర్ అలిస్సా హీలీ బౌండరీల వర్షం కురిపించింది. ఈ ఆసీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ ఉమన్ 47 బంతుల్లో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. హీలీ స్కోరులో 18 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మరో ఎండ్ లో దేవికా వైద్య 36 పరుగులు చేసి హీలీకి చక్కని సహకారం అందించింది. ఈ జోడీని విడదీయడానికి బెంగళూరు బౌలర్లు విఫలయత్నాలు చేశారు. ఈ ఓటమి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వరుసగా నాలుగోది. డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నది ఈ జట్టే.