China: షాంఘైలో వింత.. ఏడాది చిన్నారి మెదడులో పిండం!
- తలలో సమస్యలతో బాధపడుతున్న ఏడాది చిన్నారి
- మెదడులో పిండం కనిపించడంతో వైద్యుల షాక్
- దీనిని ‘ఫీటస్ ఇన్ ఫీటు’ అంటారన్న వైద్యులు
చైనాలోని షాంఘై నగరంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఏడాది వయసున్న శిశువు మెదడులో పిండం ఉన్నట్టు గుర్తించి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ చిన్నారి తలలో సమస్యలతో బాధపడుతుండడం, శరీరంలోని కండరాల్లో కదలికలు సరిగా లేకపోవడంతో స్కాన్ చేసిన వైద్యులు మెదడులో పిండాన్ని చూసి షాకయ్యారు. నాలుగు అంగుళాలు ఉన్న పిండానికి పలు అవయవాలతోపాటు వేళ్ల గోర్లు కూడా అభివృద్ధి చెందాయి.
శిశువు తల్లిగర్భంలో పెరుగుతున్నప్పుడే అవి అభివృద్ధి చెంది ఉంటాయని భావిస్తున్నారు. కవల పిల్లల్లో ఒక పిండం ఎదిగి, మరో పిండం ఎదగకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయని వైద్యులు తెలిపారు. ఈ అరుదైన కేసును ‘ఫీటస్ ఇన్ ఫీటు’ అంటారని పేర్కొన్నారు.
పిండాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు విభజన సరిగా జరగకపోతే ఒక పిండం మెదడులో మరో పిండం కలిసిపోతుందన్నారు. కాగా, ఫుడాన్ వర్సిటీలోని హుయాసన్ ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ జోంజే విజయవంతంగా శస్త్రచికిత్స చేసి మెదడులోని పిండాన్ని తొలగించారు.