New Delhi: హోలీ సందర్భంగా జపాన్ యువతికి వేధింపులు
- ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన
- జపాన్ యువతిపై బలవంతంగా రంగులు జల్లిన యువకులు
- నిందితుల అరెస్ట్
భారత పర్యటనకు వచ్చిన జపాన్ యువతి హోలీ సందర్భంగా దారుణ అనుభవం ఎదుర్కొంది. ఆమెను అడ్డుకున్న ముగ్గురు యువకులు సదరు యువతిపై బలవంతంగా రంగులు చల్లి, కోడి గుడ్లు కొట్టారు. ఢిల్లీలో వెలుగు చూసిన ఈ ఉదంతంలో పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘‘ఈరోజు హోలీ’’ అంటూ రెచ్చిపోయిన యువకులు జపాన్ యువతిపై బలవంతంగా రంగులు జల్లారు. ఆమె నెత్తిపై కోడిగుడ్డు కొట్టి ముఖమంతా పులిమారు. ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఆమె ఓ యువకుడిపై చేయి కూడా చేసుకోవాల్సి వచ్చింది. యువతిపై వేధింపులకు పాల్పడిన వారిలో ఓ మైనర్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె పహాడ్‌గంజ్ ప్రాంతంలో ఉండేదని, నిందితులు కూడా అదే ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు. ఇక ఈ ఉదంతంపై నెట్టింట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే.. యువతి మాత్రం నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది.
ఇక ఘటన అనంతరం జపాన్ యువతి తన పర్యటనను కొనసాగించింది. తాజాగా బంగ్లాదేశ్ చేరుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్లో వెల్లడించింది. ప్రస్తుతం తాను శారీరకంగా, మానసికంగా పూర్తి ఫిట్‌గా ఉన్నానని పేర్కొంది.