Gujarat Assembly: బీబీసీపై చర్యలు తీసుకోవాలంటూ గుజరాత్ అసెంబ్లీ తీర్మానం
- ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టకు భంగకరమన్న గుజరాత్ అసెంబ్లీ
- 135 కోట్ల భారతీయులకూ వ్యతిరేకమంటూ తీర్మానం
- మోదీ తన జీవితాన్ని జాతిసేవ కు అంకితం చేశారన్న మంత్రి సంఘవి
గుజరాత్ అసెంబ్లీ శుక్రవారం ఓ ప్రత్యేక తీర్మానం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పేరు, ప్రతిష్టలను దెబ్బతీసేందుకు బీబీసీ 2002 నాటి గోద్రా అల్లర్లపై ఓ డాక్యుమెంటరీని రూపొందించి ప్రసారం చేయడం తెలిసిందే. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ గుజరాత్ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
‘‘సదరు డాక్యుమెంటరీ కేవలం భారత ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే వ్యతిరేకం కాదు, 135 కోట్ల భారతీయులకూ వ్యతిరేకమైనది. పీఎం మోదీ తన జీవితం మొత్తం దేశ సేవకే అంకితం చేశారు. అభివృద్ధినే ఆయుధంగా చేసుకుని, జాతి వ్యతిరేక శక్తులకు బలమైన జవాబు ఇచ్చారు. భారత్ ను అంతర్జాతీయ ముఖచిత్రంపై నిలిపేందుకు ఆయన ఎంతో శ్రమిస్తున్నారు’’ అని గుజరాత్ రాష్ట్ర మంత్రి హర్ష సంఘవి తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో బీబీసీ విడుదల చేసిన ‘ఇండియా ద మోదీ క్వొచ్ఛన్’ డాక్యుమెంటరీ వివాదాస్పదం కావడం తెలిసిందే. ఇందులో గోద్రా అల్లర్ల నాడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీని దోషిగా చూపించే ప్రయత్నం బీబీసీ చేసింది. కానీ, గోద్రా అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు సైతం మోదీకి లోగడ క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే.