H3N2: ఫ్లూ కేసులు పెరుగుతుండడంతో.. గైడ్ లైన్స్ జారీ చేసిన ఐసీఎంఆర్
- హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని సూచన
- జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు హితవు
- నెలాఖరులోగా కేసులు తగ్గుతాయని వెల్లడి
దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతుండడం, హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గైడ్ లైన్స్ జారీ చేసింది. హెచ్3ఎన్2 వైరస్ సీజనల్ వ్యాధి అని పేర్కొంటూ ఏటా రెండు పర్యాయాల్లో పలు సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుంటాయని తెలిపింది.
ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ కేసులు ఈ నెలాఖరులోగా తగ్గుముఖం పడతాయని వివరించింది. అయితే, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని పేర్కొంది. జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని తెలిపింది.
ఈ జాగ్రత్తలతో వైరస్ నుంచి భద్రత
- ఇంట్లో నుంచి బయటకు వచ్చినపుడు మాస్క్ ధరించడం మర్చిపోవద్దు. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండడం మేలు
- దగ్గినపుడు, తుమ్మినపుడు ముక్కుతో పాటు నోటిని కూడా కవర్ చేసుకోవాలి
- చేతులతో కళ్ళు, ముక్కును పదేపదే తాకవద్దు. వైరస్ వ్యాప్తికి ఇది కారణమయ్యే అవకాశం ఉంది
- జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతుంటే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి
- కరచాలనం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం చేయొద్దు
- వైద్యుల సూచన లేకుండా యాంటీబయాటిక్ మందులు వాడొద్దు
- గ్రూప్ గా కూర్చుని ఆహారం తీసుకోవడం మానేయాలి