matrimonial site: మ్యాట్రిమోనీ సైట్ కు వెళ్లింది.. పెళ్లి కోసం కాదు జాబ్ కోసమట!
- మ్యాట్రిమోనీ సైట్ లో కేవలం పెళ్లి సంబంధాలే ఉంటాయనుకుంటున్నారా?
- అభ్యర్థుల విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు, వేతన వివరాలు కూడా లభ్యం
- వాటి ఆధారంగా మంచి ఉద్యోగం సంపాదించే ప్రయత్నం
పెళ్లి కావాలంటే మ్యాట్రీమోనీ సైట్ కు వెళ్లాల్సిందినేనని చాలా మంది చెబుతుంటారు. నేడు వ్యక్తుల మధ్య సంబంధాలు పలుచబడుతున్న క్రమంలో జీవిత భాగస్వాముల అన్వేషణకు ఆన్ లైన్ సాయాన్ని చాలా మంది తీసుకుంటున్నారు. ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకుని అందుబాటులో ఉన్న వాటిని, తమ జోడీని ఎంపిక చేసుకుంటూ ఉంటారు.
ఓ మహిళ మ్యాట్రిమోనియల్ సైట్ ను తన పెళ్లి సంబంధం కోసం కాకుండా, మంచి ఉద్యోగం సంపాదించడం కోసం ఉపయోగించుకోవడమే ఇక్కడ ఆసక్తికరం. అదెలా? అని ఆశ్చర్యపోతున్నారా..? అదే మరి ట్విస్ట్. అశ్విన్ బన్సాల్ ఇందుకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. తన ఫ్రెండ్ ‘జీవన్ సాథి’ డాట్ కామ్ లో ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకుని, అక్కడ అందుబాటులో ఉన్న ప్రొఫైల్స్ చూసి ఏ కంపెనీలో ఏ మేర జీతాలిస్తున్నదీ తెలుసుకుంది.
ఈ విషయం తెలిసిన నెటిజన్లు సదరు మహిళ స్మార్ట్ నెస్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. ‘‘నవ్యత ఎక్కడైనా, ప్రతిచోటా’ అంటూ ఒకరు కామెంట్ చేయగా, ‘‘నవ్యతతో కూడిన ఆలోచనలు, ఆమె అద్భుతాలు సృష్టిస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఒకటే ఫిల్టర్.. రెండు లక్ష్యాలు: అధిక వేతనం సంపాదించే భర్తను గుర్తించడం ఒకటి అయితే, అధిక వేతనం కూడిన ఉద్యోగం సంపాదించడం రెండో ఎత్తుగడ’’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు.