USA: అమెరికా ప్రభుత్వంలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు
- అమెరికా వాణిజ్య శాఖ సలహా కమిటీకి రేవతి, మనీశ్‌ల ఎంపిక
- శుక్రవారం ప్రకటించిన అధ్యక్షుడు బైడన్
- శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తగా రేవతికి గుర్తింపు
- పర్యావరణ హిత చట్టాల రూపకల్పనలో మనీశ్ కీలక పాత్ర
అమెరికా ప్రభుత్వంలో భారతీయులకు దక్కుతున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతో మంది భారత సంతతికి చెందిన వారు యూఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ జాబితాలోకి తాజాగా మరో ఇద్దరు వచ్చి చేరారు. అమెరికా వాణిజ్య వ్యవహారాల శాఖకు చెందిన సలహా కమిటీలో సభ్యులుగా ఇద్దరు ఇండియన్ అమెరికన్లను ఎంపిక చేసినట్టు అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ప్రకటించారు. ఫ్లెక్స్ సంస్థ సీఈఓ రేవతి అద్వైతీ, నేచరుల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్(ఎన్‌ఆర్‌డీసీ) సీఈఓ మనీశ్ బప్నాకు సలహాదారు బాధ్యతలను అప్పగిస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఫ్లెక్స్ కంపెనీ సీఈఓగా కొనసాగుతున్న రేవతి తన కెరీర్‌లో పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫార్చున్ పత్రికకు చెందిన శక్తిమంతమైన మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో వరుసగా నాలుగేళ్ల పాటు కొనసాగారు. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పట్టభద్రరాలైన ఆమె.. థండర్‌బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేశారు.
ఎన్‌ఆర్‌డీసీకి సీఈఓగా ఉన్న మనీశ్ తన 25 ఏళ్ల కెరీర్‌లో పర్యావరణ ప్రధానమైన పలు చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ యూనివర్సిటీ ఎమ్ఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్, ఎకనమిక్ డవలప్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.