Kids: ఈ కాయగూరలతో పిల్లల్లో కాల్షియం లోపానికి చెక్
- కాల్షియం లోపం వల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం
- నీరసంతో పాటు రోగ నిరోధకత కూడా తగ్గుతుందట
- రోజువారీ ఆహారంలో సోయాబీన్, పెరుగు చేర్చాలంటున్న నిపుణులు
భారత దేశంలోని కోట్లాదిమంది పిల్లల్లో కనిపించే సాధారణ సమస్య ‘కాల్షియం లోపం’.. పిల్లల ఎదుగుదలపై ఇది ప్రభావం చూపుతుంది. మిగతా అనారోగ్య సమస్యలకూ దారితీస్తుంది. ఎప్పుడూ నీరసంగా కనిపిస్తుంటారని, వారి ఎముకల సాంద్రత కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఎదురవకముందే తప్పించుకోవచ్చని, పిల్లలకు పెట్టే ఆహారంలో కాస్త మార్పులు చేస్తే సరిపోతుందని సూచించారు. నిపుణుల సూచనల ప్రకారం.. పిల్లల ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన పదార్థాలు సోయాబీన్, పాలకూర, బ్రొకోలి, పెరుగు, బాదం, చీజ్, బీన్స్.. తదితరాలు.
పిల్లల ఆహారంలో వీటిని చేర్చండి..
- కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలలో సోయాబీన్స్ ఒకటి.. ప్రతీ 100 గ్రాముల సోయాబీన్స్ లో దాదాపు 250 ఎంజీ పైనే కాల్షియం అందుతుంది.
- పాలకూరలో పోషకాలు ఎక్కువ. కాల్షియం లోపాన్ని నివారించడంతో పాటు విటమిన్ సి, కే, ఫోలిక్ యాసిడ్, ఐరన్ తదితర పోషకాలు ఉంటాయి
- పిల్లల ఎదుగుదలకు తోడ్పడే మరో వెజిటబుల్ బ్రొకోలి. విటమిన్ సి, కే లతో పాటు పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది
- రోజుకో స్పూన్ పెరుగు తినిపించడం ద్వారా పిల్లలకు అవసరమైన పోషకాలను అందించవచ్చు. పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుందని, పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు
- రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే పిల్లలకు తినిపించడం ఆరోగ్యకరమని నిపుణుల సూచన. రోజుకో గుప్పెడు బాదాం పప్పుతో పిల్లల ఎముకలు దృఢంగా తయారవడంతో పాటు మానసికంగా కూడా పిల్లలు బలంగా తయారవుతారు
- ఇంట్లో తయారుచేసిన చీజ్ ను పిల్లల ఆహారంలో చేర్చడం వల్ల వారిలో కాల్షియం లోపం రాకుండా చూసుకోవచ్చు
- కాల్షియంతో పాటు పైబర్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలను పిల్లలకు రోజూ తినిపించాలి. దీనివల్ల పిల్లల రోగనిరోధకత పెరుగుతుంది