NTR Dist: పెనుగంచిప్రోలులో అంతుచిక్కని వ్యాధితో 1000కిపైగా వరాహాల మృతి!
- మునేరు వైపు మేతకు వెళ్లి తిరిగిరాని పందులు
- ఎక్కడ పడితే అక్కడ పడి చనిపోతున్న వైనం
- పెంపకందారులకు లక్షల్లో నష్టం
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అంతుచిక్కని వ్యాధి బారినపడి వరాహాలు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయి. గత పక్షం రోజుల్లో దాదాపు 1000కిపైగా పందులు మృత్యవాత పడ్డాయి. స్థానిక తిరుపతమ్మ దేవాలయం దిగువ ప్రాంతంలో కొందరు పందుల్ని పెంచుతున్నారు. మునేరు పరిసర ప్రాంతాల వైపు మేతకు వెళ్తున్న పందులు ఆ తర్వాత తిరిగి రావడం లేదు. దీంతో వాటిని వెతికేందుకు వెళ్లిన పెంపకందారులు ఎక్కడపడితే అక్కడ చనిపోయి పడివున్న పందులను చూసి హతాశులవుతున్నారు.
పందుల మరణం కారణంగా ఒక్కొక్కరు లక్షల్లో నష్టపోయినట్టు చెబుతున్నారు. వాటికి మందులిచ్చినా ఫలితం లేకుండా పోయిందని, దీంతో అధికారులకు సమాచారం అందించినట్టు పెంపకందారులు చెప్పారు. చనిపోయిన పందుల నుంచి నమూనాలు సేకరించేందుకు ప్రయత్నించినా అవి కుళ్లిపోవడంతో సాధ్యం కాలేదని పశువైద్యులు పేర్కొన్నారు. వాటికి పెట్టే ఆహారం, నీళ్లు మార్చాలని పెంపకందారులకు సూచించినట్టు చెప్పారు.