Apple watch: మరి కొద్దిసేపు ఆగితే గుండె పోటుతో ప్రాణం పోయేదే! ఇంతలో జరిగిందో అద్భుతం..!

Apple Watch saves life of a 36 year old user suffering from heart condition

  • యువకుడి గుండె పనితీరులో మార్పు 
  • సమస్యను గుర్తించి అతడిని వెంటనే అప్రమత్తం చేసిన యాపిల్ వాచ్
  • తప్పిన ప్రాణాపాయం
  • బ్రిటన్‌లో వెలుగు చూసిన ఉదంతం

యాపిల్ వాచ్ మనుషుల ప్రాణాలు కాపాడిన ఘటనలు గతంలో అనేకం చూశాం. ఇదే కోవలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. యాపిల్ వాచ్ కారణంగా ఓ యువకుడికి ప్రాణాపాయం తప్పింది. బ్రిటన్‌కు చెందిన ఆడమ్ క్రాఫ్ట్‌ వయసు 36 సంవత్సరాలు. ఇటీవల ఓ రోజు సాయంత్రం సోఫాలోంచి లేవగానే అతడికి తల తిరిగినట్టు అనిపించింది. దీంతో.. వంటగదిలోకి వెళ్లి మంచినీళ్లు తాగుతుండంగా స్పష్టంగా చెప్పలేని ఇబ్బందికి గురయ్యాడు. ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. 

ఆ తరువాత ఆ విషయం గురించి మర్చిపోయిన క్రాఫ్ట్  రాత్రి యథాప్రకారం నిద్రకు ఉపక్రమించాడు. తెల్లారి నిద్ర లేచి చూసుకునే సరికి తన చేతికున్న యాపిల్ వాచ్‌లో పలు అలర్ట్ సందేశాలు కనిపించాయి. క్రాఫ్ట్ గుండె కొట్టుకునే తీరులో లోపం ఉందనేది ఆ సందేశాల సారాంశం. సాధారణంగా అయితే.. అతడు ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకునే వాడు. కానీ యాపిల్ వాచ్ రాత్రంతా ఇలాంటి పలు అలర్ట్‌లు పంపించడంతో ఎందుకైనా మంచిదని వైద్యులను సంప్రదించాడు. అతడికి వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు యాపిల్ వాచ్ అలర్ట్‌లు నిజమేనని ధ్రువీకరించారు. 

అతడు ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్‌తో బాధపడుతున్నట్టు చెప్పారు. గుండెకొట్టుకునే తీరులో లోపం తలెత్తడాన్ని ఏట్రియల్ ఫిబ్రిల్లేషన్ అంటారు. దీని బారిన పడ్డవారిలో సాధారణంగా పైకి ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవు. దీంతో.. వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం కష్టమవుతుందని వైద్యులు చెప్పారు. సమయానికి చికిత్స అందని పక్షంలో ఇది గుండెపోటుకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. వైద్యులు చెప్పిందంతా విన్న క్రాఫ్ట్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. యాపిల్ వాచ్‌యే తనను కాపాడిందంటూ స్థానిక మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News