3 Kg Gold: బూట్లలో బంగారం దాచుకొచ్చారు.. ఎయిర్ పోర్టులో దొరికిపోయారు!
- ఇథియోపియా నుంచి ముంబై వచ్చిన ముగ్గురు వ్యక్తులు
- బూట్లు, లోదుస్తుల్లో 3 కిలోల బంగారం దాచిన వైనం
- వీడియో ట్వీట్ చేసిన ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ
- బంగారం విలువ రూ.1.40 కోట్ల దాకా ఉంటుందన్న అధికారులు
కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా పెట్టినా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజూ విదేశాల నుంచి విమానాల్లో తీసుకురావడం, ఎయిర్ పోర్టుల్లో పట్టుబడటం పరిపాటిగా మారింది. ఇటీవల కిలోల కొద్దీ తీసుకొస్తూ పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో 3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మార్చి 10న ఇథియోపియాలోని అడిస్ అబాబా నుంచి ముంబైకి ముగ్గురు వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అధికారులు సోదా చేశారు. లోదుస్తులు, బూట్లలో బంగారం దాచినట్లు గుర్తించారు. మొత్తం తూకంవేయగా.. మూడు కిలోలు ఉన్నట్లు తేలిందని ముంబై ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ఈ బంగారం విలువ రూ.1.40 కోట్ల దాకా ఉంటుందని తెలిపారు.
ఇందుకు సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. బూట్ల నుంచి చిన్న చిన్న బంగారు బిళ్లలను బయటికి తీయడం అందులో కనిపించింది. ముగ్గురు విదేశీయులను అరెస్ట్ చేశామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు శనివారం తమిళనాడులోని కోయంబత్తూరులో రూ.3.8 కోట్ల విలువైన బంగారాన్నిఅధికారులు సీజ్ చేశారు. షార్జా నుంచి వచ్చిన 11 మంది నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆభరణాల బరువు 6.2 కిలోలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.