BBC: బీబీసీ టీవీ యాంకర్ల తిరుగుబాటు.. విధుల బహిష్కరణ
- కొత్త వివాదంలో చిక్కుకున్న బీబీసీ
- బ్రిటన్ ప్రభుత్వ వలసల విధానాన్ని బహిరంగంగా విమర్శించిన టీవీ యాంకర్
- ఆయనను విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశించిన బీబీసీ
- యాంకర్‌కు మద్దతుగా సహోద్యోగుల తిరుగుబాటు, విధుల బహిష్కరణ
బీబీసీ మరో వివాదంలో చిక్కుకుంది. ప్రభుత్వ విధానాలను విమర్శించిన ఓ యాంకర్‌ను విధుల నుంచి తప్పుకోవాలంటూ ఆదేశించి సమస్యల్లో పడింది. బాధిత యాంకర్‌కు మద్దతుగా సహచర ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో బీబీసీలో పలు కార్యక్రమాలు అర్ధాంతరంగా రద్దయ్యాయి.
అక్రమవలసలను నిరోధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఇందులోని నిబంధనలు అత్యంత కఠినంగా ఉండడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో బీబీసీలోని ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ గారీ లైన్కర్ బ్రిటన్ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కొత్త చట్టం జర్మనీలో నాజీల నిరంకుశత్వాన్ని గుర్తుకుతెస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీబీసీ యాజమాన్యం ఆయనపై కన్నెర్ర చేసింది. విధుల నుంచి తక్షణం తప్పుకోవాలంటూ ఆదేశించింది. దీంతో.. గారీ నిష్క్రమించారు.
ఈ పరిణామం బీబీసీలో కలకలానికి దారితీసింది. సహచర ఉద్యోగి భావప్రకటనా స్వేచ్ఛను హరించారంటూ ఇతర యాంకర్లు గళమెత్తారు. విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పలు స్పోర్ట్స్ కార్యక్రమాలు రద్దయిపోయాయి. ఈ ఉదంతం బీబీసీని అపఖ్యాతి పాలు చేసినట్టైంది. ప్రభుత్వానికి, అధికార పక్షానికి వంత పాడుతోందంటూ అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.