Team India: నాలుగో టెస్టును అడ్డుకుంటామని బెదిరించిన ఇద్దరి అరెస్ట్
- భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు గురువారం అహ్మదాబాద్ లో ఉన్నప్పుడు బెదిరింపులు
- ఖలిస్థాన్ అనుకూల గ్రూపుల మద్దతుతో సందేశాలు పంపించిన నిందితులు
- అధునాతన సిమ్ బాక్స్ టెక్నాలజీ ఉపయోగించినట్టు గుర్తించిన పోలీసులు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ను అడ్డుకుంటామని హెచ్చరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలిస్థాన్ అనుకూల గ్రూపుల మద్దతుతో బెదిరింపులకు పాల్పడిన వారిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెల్ పట్టుకుంది. సిమ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి మ్యాచ్ సందర్భంగా బెదిరింపులకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ గురువారం అహ్మదాబాద్ లో ఉన్నప్పుడు నిందితుల నుంచి బెదిరింపులు వచ్చాయి.
సమాచారం అందుకున్న అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించి నిందితుల ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించింది. నిందితులు అధునాతన సిమ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని, ఇది కొన్నిసార్లు ట్రాక్ చేయడం కష్టమని పోలీసులు తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా నిందితులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్ లోకేషన్ల నుంచి సందేశాలు పంపించారు. అలాగే, పాకిస్థాన్‌లో యాక్టివ్‌గా ఉన్న నకిలీ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి కూడా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.