street dog attacks: హైదరాబాద్ లో వీధి కుక్క స్వైర విహారం.. 16 మందిపై దాడి
- హైదరాబాద్ లో గుంపులుగా తిరుగుతూ దాడులు చేస్తున్న వీధి కుక్కలు
- బాలానగర్ పరిధిలో నడుచుకుంటూ వెళ్తున్న వారిని కరిచిన కుక్క
- మూడేళ్ల చిన్నారి సహా 16 మందికి గాయాలు
హైదరాబాద్ లో వీధి కుక్కల బెడద పెరిగిపోతోంది. వీధుల్లో, ప్రధాన రహదారుల్లో గుంపులుగా తిరుగుతూ.. జనంపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ బాలానగర్ లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది.
బాలానగర్ పరిధిలోని వినాయక నగర్ లో ఓ వీధి కుక్క.. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించింది. 16 మందిపై దాడి చేసింది. శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై ఎగబడి కరిచింది. గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు కూకట్ పల్లి జోన్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. అక్కడికి చేరుకుని దాదాపు 2 గంటలపాటు శ్రమించి కుక్కను పట్టుకున్నారు.
20 రోజుల కిందట అంబర్‌పేటలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్.. కుక్కల దాడిలో చనిపోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత కూడా రోజూ ఏదో ఒక చోట కుక్కల దాడి ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి.