Team India: డబుల్ సెంచరీ చేజార్చుకున్న కోహ్లీ... టీమిండియా 571 ఆలౌట్
- అహ్మదాబాద్ టెస్టులో రాణించిన టీమిండియా బ్యాటర్లు
- 186 పరుగులు చేసి అవుటైన కోహ్లీ
- 79 పరుగులతో ఆకట్టుకున్న అక్షర్ పటేల్
- బ్యాటింగ్ కు దిగని శ్రేయాస్ అయ్యర్
అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా అద్భుతమైన పోరాటం నమోదు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేయగా... అందుకు బదులుగా భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులు చేసింది. తద్వారా 91 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది.
టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే విరాట్ కోహ్లీ సెంచరీయే. అయితే కోహ్లీ 186 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. కోహ్లీ 9వ వికెట్ రూపంలో వెనుదిరగ్గా, శ్రేయాస్ అయ్యర్ (అబ్సెంట్ హర్ట్) బ్యాటింగ్ కు దిగకపోవడంతో టీమిండియా ఆలౌట్ అయినట్టు ప్రకటించారు.
నేటి ఆటలో చెప్పుకోదగ్గ మరో ఇన్నింగ్స్ అక్షర్ పటేల్ నుంచి వచ్చింది. కోహ్లీతో కలిసి అక్షర్ పటేల్ నమోదు చేసిన కీలక భాగస్వామ్యమే ఈ మ్యాచ్ లో భారత్ పైచేయి సాధించేందుకు ఉపయోగపడింది. అక్షర్ పటేల్ 113 బంతులాడి 5 ఫోర్లు, 4 సిక్సులతో 79 పరుగులు చేశాడు. చివర్లో అశ్విన్ 7, ఉమేశ్ సున్నా పరుగులకు అవుటయ్యారు. షమీ (0) నాటౌట్ గా మిగిలాడు.
ఆసీస్ బౌలర్లలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లైయన్ 3, యువ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 1, లెఫ్మార్మ్ స్పిన్నర్ కుహ్నెమన్ 1 వికెట్ తీశారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 6 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ ఎంతో ముందుజాగ్రత్తతో తమ స్పిన్నర్ కుహ్నెమన్ ను ఓపెనర్ గా బరిలో దింపింది. ప్రస్తుతం క్రీజులో కుహ్నెమన్ (0 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్ (3 బ్యాటింగ్) ఉన్నారు.
కాగా, ఇవాళ్టి ఆటలో బ్యాటింగ్ కు దిగని శ్రేయాస్ అయ్యర్ నడుం నొప్పితో బాధపడుతున్నట్టు తెలిసింది. అయ్యర్ ను స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు.