IndiGo: ప్రయాణికుడికి అస్వస్థత.. పాకిస్థాన్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ లాండింగ్!
- మార్గమధ్యంలో నైజీరియా ప్రయాణికుడికి అస్వస్థత
- విమానాన్ని అత్యవసరంగా కరాచీ ఎయిర్‌పోర్టులో దింపిన పైలట్
- అప్పటికే బాధితుడు మృతి చెందినట్టు వైద్యుల ప్రకటన
ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు లోనుకావడంతో విమానాన్ని అత్యవసరంగా పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్ పోర్టులో దించాల్సి వచ్చింది. అయితే.. ప్రయాణికుడు అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఢిల్లీ నుంచి దోహా వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు నైజీరియా దేశానికి చెందిన అబ్దుల్లాగా(60) గుర్తించారు. ఈ మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ తాజాగా ఓ ప్రకటనలో విడుదల చేసింది.
విమానం మార్గమధ్యంలో ఉండగా నైజీరియా ప్రయాణికుడు అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో పైలట్ కరాచీ ఎయిర్‌పోర్టుకు చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందించారు. మెడికల్ కారణాల రీత్యా అత్యవసరంగా లాండయ్యేందుకు అనుమతి కోరారు. అయితే.. విమానం కరాచీలో దిగే సమయానికే అతడు మరణించినట్టు అక్కడి వైద్యులు ప్రకటించారు. దీంతో..ఇండిగో విమానం అబ్దుల్లా మృతదేహంతో తిరిగి ఢిల్లీకి చేరుకుంది. ప్రయాణికులను తమ గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.