herbs: కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఔషధాలు ఇవి..!
- రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు, పలు ఇతర ముఖ్య పనుల నిర్వహణ
- ఈ పనితీరును పెంచేందుకు సాయపడే కొన్ని ఔషధాలు
- అల్లం, పసుపు ఎంతో మంచివి
- గిలోయ్, త్రిఫలతో మంచి ఫలితాలు
మనం ఆరోగ్యంగా ఉండేందుకు అనుక్షణం శ్రమించే అవయవాల్లో కిడ్నీలు కూడా మఖ్యమైనవి. మన శరీరంలోని వ్యర్థాలను ఇవి వడగట్టి మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంటాయి. కనుక కిడ్నిలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా పని చేయాలి. ఎవైనా కొన్ని కారణాల వల్ల కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదంటే అప్పుడు శరీరంలోని ట్యాక్సిన్లు పూర్తిగా బయటకు వెళ్లవు. దీంతో గౌట్, అనీమియా, థైరాయిడ్, ఎముకలు, గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. శరీరంలో నీరు పెరిగిపోతుంది.
రక్తాన్ని కిడ్నీలు సమర్థవంతంగా అరికట్టనప్పుడు ట్యాక్సిన్లు పేరుకుపోవడం వల్ల ఆకలి కూడా తగ్గిపోతుంది. శరీరంలో నీటి పరిమాణం (సరిగ్గా బయటకు వెళ్లలేక) పెరిగి శ్వాస ప్రక్రియకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కిడ్నీలు అంటే కేవలం రక్తాన్ని వడకట్టడమే కాకుండా.. మరో మూడు ముఖ్యమైన పనులను కూడా చేస్తుంటాయి. రక్తపోటును కిడ్నీలు నియంత్రిస్తాయి. అలాగే, విటమిన్ డీ తయారీకి సాయపడతాయి. కండరాలు, ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డీ అవసరం. రక్తం తయారీకి అవసరమైన ఎరిత్రో ప్రయిటీన్ ఉత్పత్తిలోనూ కిడ్నీల పాత్ర ఉంటుంది.
జీవనశైలి మార్పులు
సమతులాహారం తీసుకోవడం, తగినంత నిద్ర పోవడం, కొంత శారీరక వ్యాయామం చేయడం కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే చర్యలు. దీనికి అదనంగా కొన్ని ఔషధాలను కూడా తీసుకోవచ్చని ఆయుర్వేదం సూచించింది. అంతర్జాతీయ ఆయుర్వేద జర్నల్ అయిన ఆయులో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం.. కొన్ని ఆయుర్వేద ఔషధాలు సిరమ్ క్రియాటినైన్, యూరిన్ అల్బూమిన్ను తగ్గించగలవని తేలింది. వైద్యుల సూచన మేరకు వీటిని వాడుకోవడం ద్వారా మంచి ఫలితాలను చూడొచ్చు.
గిలోయ్
యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు గిలోయ్ లో ఉన్నాయి. ఫ్రీరాడికల్స్ (కణాలకు హాని చేసేవి)ను తొలగిస్తాయి.
పసుపు
ప్లాస్మా ప్రొటీన్లను టర్మరిక్ మెరుగుపరుస్తుంది. సిరమ్ యూరియా, క్రియాటినైన్ ను తగ్గిస్తుంది. కిడ్నీల పనితీరును బలోపేతం చేస్తుంది.
అల్లం
అల్లానికి యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఉన్నాయి. కిడ్నీల్లో వాపును, నొప్పిని తగ్గిస్తుంది.
త్రిఫల
కిడ్నీల సహజ పనితీరును పెంచడంలో త్రిఫల మంచి పాత్ర పోషిస్తుంది. కిడ్నీలతోపాటు, కాలేయానికీ మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు, కాలేయం కీలకంగా వ్యవహరిస్తాయి.
ఆమ్లకి, హరీతకి, బిబీతకి
కిడ్ని కణజాలాన్ని బలపేతం చేస్తాయి. అల్బూమిన్, క్రియాటినైన్, ప్లాస్మా ప్రొటీన్లను మెరుగుపరుస్తాయి. మొత్తం మీద కిడ్నీల పనితీరును పెంపొందిస్తాయి.