latvia: తాగి వాహనం నడిపితే.. కారు ఉక్రెయిన్ కు పార్సిల్ చేస్తామంటున్న లాట్వియా దేశం
- పౌరులలో ఆ అలవాటును మాన్పించేందుకు వినూత్న నిర్ణయం
- డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనంపైన ఆశ వదులుకోవాల్సిందే!
- ఉక్రెయిన్ కు సాయం, దేశ పౌరులలో క్రమశిక్షణ పెంచడమే లక్ష్యమని ప్రభుత్వ వివరణ
మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే మన దేశంలో డ్రైవర్ పై కేసు పెట్టి, వాహనం సీజ్ చేస్తారు. తర్వాత కోర్టుకు హాజరై, జరిమానా చెల్లించి వాహనాన్ని తీసుకోవచ్చు. అయితే, లాట్వియా దేశంలో మాత్రం అలా కుదరదు. తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే ఇక ఆ వాహనాన్ని వదులుకోవాల్సిందే. ఎప్పటికీ తిరిగొచ్చే అవకాశమే ఉండదు. ఇలా పట్టుకున్న వాహనాలను ఆ దేశం ఉక్రెయిన్ కు పంపిస్తోంది. కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్ కు ఎంతోకొంత సాయం చేసినట్లు ఉంటుందని, అదే సమయంలో తమ దేశ పౌరులలో తాగి నడిపే అలవాటును మాన్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ లో పట్టుకున్న వాహనాలను గతంలో పోలీస్ స్టేషన్లలోనే ఉంచేవారు. అయితే, స్టేషన్ల ఆవరణలు మొత్తం వాహనాలతోనే నిండిపోయాయి. ఈ నేపథ్యంలో కొత్తగా పట్టుకునే వాహనాలను ఉక్రెయిన్ కు పంపించాలని నిర్ణయించింది. ఇప్పటికే పట్టుబడ్డ దాదాపు 200 వాహనాలను ఉక్రెయిన్ కు చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇలా అందుకున్న వాహనాలను ఉక్రెయిన్ సైన్యం ఆసుపత్రులు, ఎమర్జెన్సీ సేవల కోసం ఉపయోగించనుంది. ఉక్రెయిన్ కు ఆర్థిక, ఆయుధ సాయం చేస్తున్న యూకే దేశాలు ఇప్పటి వరకు దాదాపు 1200 వాహనాలను కూడా యుద్ధ భూమికి పంపించాయి.