Team India: చప్పగా సాగుతున్న అహ్మదాబాద్ టెస్టు
- డ్రా దిశగా చివరి టెస్టు
- రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 2 వికెట్లకు 153 రన్స్
- ఆసీస్ ఆధిక్యం 62 పరుగులు
- ఆటకు నేడు చివరి రోజు
అహ్మదాబాద్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. ఆటకు నేడు చివరి రోజు కాగా, ఆసీస్ లంచ్ విరామానంతరం రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 153 పరుగులతో ఆడుతోంది. ప్రస్తుతానికి ఆసీస్ ఆధిక్యం 62 పరుగులు. ఇంకా చేతిలో 8 వికెట్లున్నాయి.
భారత్ కు కష్టసాధ్యమైన లక్ష్యం నిర్దేశించాలన్నా, మరో మూడు నాలుగు గంటలకు పైనే బ్యాటింగ్ చేయాలి. ఒకవేళ ఆసీస్... భారత్ కు లక్ష్యాన్ని నిర్దేశించినా.... పెద్దగా సమయం లేకపోవడంతో, మ్యాచ్ లో ఫలితం తేలే అవకాశాలు అత్యంత తక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం క్రీజులో మార్నస్ లబుషేన్ 51, స్టీవ్ స్మిత్ పరుగులేమీ లేకుండా ఆడుతున్నారు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 90 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.
ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 480 పరుగులు చేయగా, భారత్ 571 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రా అయినా చాలు... నాలుగు టెస్టుల సిరీస్ 2-1తో టీమిండియా వశమవుతుంది.