Team India: చివరి టెస్టు డ్రా... కెప్టెన్ల అంగీకారంతో ముందే ముగిసిన మ్యాచ్
- పేలవంగా ముగిసిన అహ్మదాబాద్ టెస్టు
- నిర్ణీత సమయం కంటే ముందే ముగిసిన మ్యాచ్
- రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 175 పరుగులు చేసిన ఆసీస్
- మార్చి 17 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్
అహ్మదాబాద్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్టు పేలవమైన డ్రాగా ముగిసింది. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దాంతో నిర్ణీత సమయం కంటే ముందే మ్యాచ్ ముగిసింది.
మ్యాచ్ ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 175 పరుగులు చేసింది. అప్పటికి ఆసీస్ ఆధిక్యం 84 పరుగులే. మార్నస్ లబుషేన్ 63, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 10 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. చివరి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో... బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1తో నిలబెట్టుకుంది.
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేయగా... టీమిండియా 571 పరుగులు చేసి 91 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
టెస్టు సిరీస్ ముగిసిన నేపథ్యంలో, ఇక అందరి దృష్టి భారత్-ఆసీస్ వన్డే సిరీస్ పై పడింది. ఇరుజట్ల మధ్య మార్చి 17 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి వన్డే ముంబయిలో జరగనుండగా, మార్చి 19న రెండో వన్డేకి విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. మార్చి 22న చివరి వన్డే చెన్నైలో జరగనుంది.