Ram Charan: ఆస్కార్ రెడ్ కార్పెట్లో ఆధునిక భారతీయతకు అద్దంపట్టిన రామ్ చరణ్, ఉపాసన
- ఆస్కార్ లో మనవాళ్ల సందడి
- రెడ్ కార్పెట్ ఈవెంట్ కు హాజరైన రామ్ చరణ్, ఉపాసన
- డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయిన కపుల్
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల సంరంభం ముగిసింది. ఈసారి ఆస్కార్ లో ఆర్ఆర్ఆర్ కారణంగా భారతీయత ఉట్టిపడింది. నాటు నాటు పాట తుది నామినేషన్ పొందడంతో దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్, సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలతో పాటు, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అందరూ ఆస్కార్ వేడుకల్లో సందడి చేశారు.
ముఖ్యంగా, ఆస్కార్ రెడ్ కార్పెట్ పై రామ్ చరణ్ సతీసమేతంగా జిగేల్మని మెరిసిపోయారు. రామ్ చరణ్, ఉపాసన ఆధునిక భారతీయ శైలిని ప్రతిబింబించేలా డిజైన్ చేసిన దుస్తుల్లో అందరినీ ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ దుస్తులను ప్రముఖ డిజైనర్లు శంతను, నిఖిల్ రూపొందించారు. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై రామ్ చరణ్ బంద్ గలా సూట్ ధరించి రాగా, జయంతి రెడ్డి డిజైన్ చేసిన సిల్క్ చీర ధరించి ఉపాసన తళుక్కుమన్నారు.
ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ పోషించిన పోలీస్ అధికారి పాత్రను జ్ఞప్తికి తెచ్చేలా... శౌర్య పతకాలను తలపించే గుండీలు, చక్ర అవార్డులను కుర్తాపై అందంగా పొందుపరిచారు. భారతీయ సమకాలీన ఫ్యాషన్ ప్రతిభకు అద్దంపట్టేలా రామ్ చరణ్ దుస్తులు ఉన్నాయి. రామ్ చరణ్ స్టయిల్, ఫ్యాషన్ కు ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నీరాజనాలు పలికారు.
ఇక, రెడ్ కార్పెట్ ఈవెంట్ కు ఉపాసన ధరించిన చీరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉపాసన పర్యావరణానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి కావడంతో... వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి రూపొందించిన చీరను ధరించారు. బినా గోయెంకా డిజైన్ చేసిన లిలియం హారాన్ని ఆమె మెడలో ధరించారు. ఈ కంఠహారంలో సహజంగా లభించే జెమ్ స్టోన్స్ పొదిగారు. మేలు జాతి ముత్యాలు, 400 క్యారట్ల హై క్వాలిటీ కెంపులతో ఉపాసన మెడను ఆ నెక్ పీస్ అందంగా అలంకరించింది.
ఆస్కార్ రెడ్ కార్పెట్ వేళ రామ్ చరణ్ స్పందిస్తూ... తాము భారతదేశ ప్రతినిధులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యామని గర్వంగా చెప్పారు. ఆస్కార్ నిర్వాహకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.