Telangana: వచ్చే మూడు రోజుల్లో.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
- నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
- ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
- కొన్ని జిల్లాల్లో వడగళ్లు పడే అవకాశం
- నిన్న రాష్ట్రవ్యాప్తంగా మండిన ఎండలు
వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రేపు మధ్యాహ్నం నుంచి ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఎల్లుండి నుంచి నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాలలో వడగళ్లు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, 17న నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ వివరించింది.
ఇక, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. 39 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 39.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, మెదక్‌లలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.