H3N2 Virus: తెలుగు రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తున్న హెచ్3ఎన్2 వైరస్
- తెలుగు రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 వ్యాపిస్తున్నట్టు ఐసీఎమ్ఆర్ అలర్ట్
- పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరగడంతో వ్యాధి వ్యాప్తి
- ప్రజల్లో మాస్క్ వినియోగం తగ్గిందంటున్న అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపిస్తోందంటూ ఐసీఎమ్ఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతుండడం, వైద్యం కోసం తెలుగు రాష్ట్రాలకు క్యూకడుతున్న విదేశీయులు, ఊపందుకున్న పర్యాటకం వెరసి..హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపించేందుకు కారణమవుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలు మాస్కులు వాడటం లేదని కూడా వెల్లడించాయి.
ఇక తెలంగాణలో కేసులు మరింత పెరిగిన పక్షంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రారంభించాలనే యోచనలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. మరోవైపు.. ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీతో హెచ్3ఎన్2 వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని కొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభుత్వం కూడా పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపై ఇప్పటికే రెండు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపాలన్న అభిప్రాయం ఈ సమావేశాల్లో వ్యక్తమైంది.
ప్రస్తుతం రక్తనమూనాలను వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపిస్తున్నట్టు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. కే. శంకర్ తెలిపారు. కేసులు సంఖ్య పెరిగితే వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఫీవర్ ఆసుపత్రితో పాటూ వరంగల్, ఆదిలాబాద్‌లోనూ ప్రారంభిస్తామని తెలిపారు. కొవిడ్, చికున్‌గున్యా నిర్ధారణ పరీక్షల కోసం వినియోగించిన ఎక్విప్‌మెంట్‌తోనే హెచ్3ఎన్2 వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.