MLAs Poaching: ఎమ్మెల్యేలకు ఎర కేసులో స్టేటస్ కో విధించిన సుప్రీంకోర్టు
- జులై 31 వరకు కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీం
- అప్పటి వరకు సీబీఐ దర్యాప్తు చేయవద్దని ఆదేశం
- తమ ఆదేశాలను పాటించకపోతే మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తామని హెచ్చరిక
ఎమ్మెల్యేలకు ఎర అంశం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఈ కేసుపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేయవద్దని ఆదేశించింది.
కేసు వివరాల్లోకి వెళ్తే... ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను గత నెల జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అరవింద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆరోజు కోర్టు సమయం మించిపోవడంతో విచారణను వాయిదా వేసింది. హోలీ సెలవుల తర్వాత ధర్మాసనం మారింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్ ల ధర్మాసనం ముందుకు నిన్న కేసు వచ్చింది.
వాదనల సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ... ఇందులో రెండు విషయాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని... హైకోర్టులోనే ఈ కేసుపై అప్పీల్ కు వెళ్లాలా? అనే విషయం ఒకటైతే... ఈ కేసులో మెరిట్స్ ఏమున్నాయనేది పరిశీలించడం రెండోదని చెప్పారు. దీనికి ఒకట్రెండు రోజుల సమయం పడుతుందని... దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత జులైలో వాదనలు వింటామని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోందా? అని ప్రశ్నించగా... దర్యాప్తు ఆగిపోయిందని, కేసును సీబీఐ స్వాధీనం చేసుకోలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది దుశ్యంత్ దవే కోర్టుకు తెలిపారు. కేసు విచారణపై యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టును కోరారు.
అనంతరం జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ... కేసు కోర్టులో ఉన్నందున సీబీఐ దర్యాప్తు చేయవద్దని చెప్పారు. ఒకవేళ దర్యాప్తు చేసినా వృథా అవుతుందని... తాము చెప్పినట్టు చేయకపోతే మధ్యంతర ఉత్తర్వులను ఇస్తామని స్పష్టం చేశారు. స్టేటస్ కో విధిస్తున్నట్టు తెలిపారు.