Telangana: తెలంగాణలో ఒంటిపూట బడులు.. ఎప్పటి నుంచంటే!
- మార్చి 15 నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకే క్లాసులు
- ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వర్తిస్తాయని ప్రకటన
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీచేసింది. వేసవి ఎండల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 లోపు క్లాసులు నిర్వహించాలని సూచించింది. మార్చి 15 నుంచి ఈ టైమింగ్స్ ఫాలో కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు ప్రైవేటు స్కూళ్లు కూడా ఒంటిపూట బడులు నిర్వహించాలని పేర్కొంది.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు క్లాసులు మధ్యాహ్నం వరకే నిర్వహించాలని, ఆ తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో వెల్లడించింది. పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగించాలని విద్యాశాఖ సూచించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ క్లాసులు నిర్వహించాలని తెలిపింది. ఈమేరకు ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్.. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను అన్ని స్కూల్స్ పాటిస్తున్నాయా లేదా అనేది క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.