Air India: బెయిల్ కోసం అంత డబ్బు కట్టనన్న ఎయిర్ ఇండియా ప్యాసెంజర్.. జైలుకు వెళ్లేందుకే నిర్ణయం!
- లండన్ నుంచి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో పొగతాగిన ద్వివేదీ
- రూ.25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు
- ఇంత మొత్తాన్ని కట్టనన్న నిందితుడు
- దీంతో జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి
ఎయిర్ ఇండియా విమానంలో పొగతాగుతూ పట్టుబడ్డ ప్రయాణికుడు రత్నాకర్ ద్వివేదీకి ముంబై కోర్టు తాజాగా జైలు శిక్ష విధించింది. తొలుత న్యాయమూర్తి.. బెయిల్ పొందేందుకు రూ. 25 వేలు చెల్లించాలని ద్వివేదీకి తెలిపారు. అయితే నిందితుడు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరించాడు. తాను జైల్‌కు వెళ్లేందుకు సిద్ధమని చెప్పడంతో కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది.
మార్చి 10న లండన్ నుంచి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ద్వివేదీ పొగతాగుతూ సిబ్బందికి చిక్కాడు. దీంతో.. తోటి ప్రయాణికులకు ప్రాణాపాయం కలిగేలా వ్యవహరించినందుకు పోలీసులు ద్వివేదీపై సెక్షన్ 336 కింద కేసు పెట్టారు. ఈ క్రమంలో కోర్టు అతడికి తొలుత రూ. 25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
అయితే.. ఇంత మొత్తం చెల్లించేందుకు ద్వివేదీ నిరాకరించాడు. తాను ఆన్లైన్లో సెర్చ్ చేయగా.. సెక్షన్ 336 కేసులో జరిమానా రూ.250గా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ జరిమానా చెల్లించేందుకు సిద్ధమేనన్న ద్వివేదీ రూ.25 వేలు మాత్రం కట్టనని చెప్పేశాడు. దీంతో ఆంధేరీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సోమవారం ఆయనకు జైలు శిక్ష విధించారు.