Ravichandran Ashwin: పుజారా బౌలింగ్.. నేనేం చేయనంటూ అశ్విన్ ప్రశ్న!
- అశ్విన్, పుజారా మధ్య ట్విట్టర్ లో ఆసక్తికర సంభాషణ
- పుజారా బౌలింగ్ చేయడాన్ని ఆటపట్టించిన అశ్విన్
- ‘నీకు కాస్త విశ్రాంతి దొరుకుతుందని..’ అంటూ బదులిచ్చిన పుజారా
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ముగియడానికి ముందు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎన్నడూ బౌలింగ్ చేయని.. చతేశ్వర్ పుజారా, శుభ్ మన్ గిల్ చెరో ఓవర్ వేశారు. ఆ తర్వాత మ్యాచ్ ను ‘డ్రా’గా అంపైర్లు ప్రకటించారు.
దీనిపై ట్విట్టర్ లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పుజారా మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పుజారా బౌలింగ్ చేస్తున్న ఫొటోను ట్వీట్ చేసిన అశ్విన్.. ‘‘మరి నేనేం చేయను.. జాబ్ వదిలేయమంటావా?’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి పుజారా బదులిస్తూ.. “అలా కాదు.. ఇది నాగ్‌పూర్‌లో నువ్వు వన్ డౌన్ బ్యాటింగ్ కు వెళ్లినందుకు ధన్యవాదాలు చెప్పడానికి మాత్రమే” అన్నాడు.
పుజారా ట్వీట్ పై స్పందించిన అశ్విన్.. ‘‘నీ ఉద్దేశం ప్రశంసించదగినదే కానీ.. ఇది ధన్యవాదాలు చెప్పడం ఎలా అవుతుందనేది నాకు అర్థం కావడం లేదు’’ అని చమత్కరించాడు. దీంతో ‘‘నీకు తగినంత విశ్రాంతి ఇవ్వడం వల్ల భవిష్యత్తులో అవసరమైతే నువ్వు మళ్లీ వన్ డౌన్ బ్యాటింగ్ కు వెళ్లవచ్చు కదా అని..’’ అని చెప్పుకొచ్చాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన అశ్విన్.. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజాతో కలిసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సంయుక్తంగా అందుకున్నాడు. ఈ సిరీస్ లో అశ్విన్ 25 వికెట్లు, జడేజా 22 వికెట్లు తీశారు.