Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు సిట్ కు అప్పగింత
- టీఎస్ పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీక్ కలకలం
- అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీక్ కేసు సిట్ కు బదలాయింపు
- ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నిర్వహించిన పలు ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకవడం సంచలనం సృష్టించింది. అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల పరీక్ష పేపర్లు లీకైనట్టు వెల్లడైంది. అటు, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రాన్ని కూడా ప్రవీణ్ బృందం లీక్ చేసినట్టు గుర్తించారు.
ఈ నేపథ్యంలో, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో దర్యాప్తు బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం సీసీఎస్ పోలీసులకు అప్పగించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్ సిట్ బృందానికి బదలాయిస్తున్నట్టు తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్టు ఈ నెల 13న ఫిర్యాదు నమోదైందని, సెక్షన్ 409, 420, 120(బి)తో పాటు ఐటీ చట్టంలోని 66సి, 66బి, 70 సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు వెల్లడించింది.