Sunil Gavaskar: ఈ ఏడాది వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే: గవాస్కర్
- ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించిన పాండ్యా
- అడపాదడపా టీమిండియాకు సారథ్యం
- పాండ్యా ఎంతో ప్రభావం చూపిస్తాడన్న గవాస్కర్
- బాధ్యతలకు వెనుదీయడని కితాబు
ఐపీఎల్ లో కెప్టెన్సీ చేపట్టిన తొలిసారే గుజరాత్ టైటాన్స్ ను చాంపియన్ గా నిలిపిన హార్దిక్ పాండ్యా... అవకాశం వచ్చినప్పుడల్లా టీమిండియా పరిమిత ఓవర్ల జట్టుకు నాయకత్వం వహిస్తూ తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డేకు రోహిత్ శర్మ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అవుతాడని తెలిపారు. "టీ20 స్థాయిలో హార్దిక్ కెప్టెన్సీ నన్ను ఎంతో ఆకట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ ను విజయపథంలో నడిపించడమే కాదు, టీ20ల్లో టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం దొరికిన ప్రతిసారీ తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత్ గెలిస్తే 2023 వరల్డ్ కప్ తర్వాత భారత్ కెప్టెన్ రేసులో పాండ్యానే ముందు నిలుస్తాడు" అని వివరించారు.
అంతేకాదు, భారత జట్టు మిడిలార్డర్ లో హార్దిక్ పాండ్యా వంటి ఆటగాడి అవసరం ఎంతో ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఆట స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్న ఆటగాడు హార్దిక్ పాండ్యా అని పేర్కొన్నారు. జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకెళ్లి ఆడగల సత్తా ఉన్న ఆటగాడు అని కొనియాడారు.
తాను సరిగా ఆడకుండా, జట్టులోని ఇతర ఆటగాళ్లు బాగా ఆడాలంటూ ఒత్తిడి చేసే రకం కాదని పాండ్యాపై ప్రశంసల జల్లు కురిపించారు. బాధ్యతలు అందుకోవడానికి వెనుదీయని లక్షణం పాండ్యాను ప్రత్యేకంగా నిలుపుతుందని గవాస్కర్ పేర్కొన్నారు.