Meta: మరో 10 వేల మందిని ఇంటికి పంపిన మెటా!
- ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపేస్తున్న టెక్ సంస్థలు
- గతేడాది 11 వేలమందిని తొలగించిన మెటా
- ఓపెన్ రోల్స్‌లో ఉన్న మరో 5 వేల మందిపైనా వేటు తప్పదన్న జుకర్‌బర్గ్
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ ‘మెటా’ ఉద్యోగులకు మరోమారు షాకిచ్చింది. గతేడాది 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన సంస్థ తాజాగా మరో 10 వేల మందిని తొలగించింది. ఉద్యోగుల ఉద్వాసన విషయాన్ని బ్లాగ్‌పోస్ట్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, తాజా నిర్ణయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కూడా తెలిపింది. ఏప్రిల్‌లో తొలగింపులు ఉంటాయని సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. మే చివరి వారం నుంచే ఆ ప్రభావం ఉంటుందన్నారు.
వచ్చే రెండు నెలల్లో పునర్నిర్మాణ ప్రణాళికలు వెల్లడిస్తామని, తక్కువ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులను రద్దు చేస్తామని జుకర్‌బర్గ్ చెప్పారు. రిక్రూటింగ్ టీంను కుదించాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, మరో బాంబు కూడా పేల్చారు. రాబోయే నెలల్లో ఓపెన్ రోల్స్‌లో ఉన్న 5 వేల మందిని తొలగించనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరి వరకు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. వివిధ స్థాయులు, వివిధ ప్రాంతాల్లో ఈ తొలగింపులు ఉంటాయి కాబట్టే అంత సమయం పడుతుందన్నారు. అయితే, ఉద్యోగాలు కోల్పోయే వారికి ఎలాంటి ప్యాకేజీ ఆఫర్ చేస్తోందన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు.
అందరిదీ ఒకేదారి
టెక్ కంపెనీల్లో గతేడాది మొదలైన లేఆఫ్‌ల పర్వం ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. ఈ ఏడాది మొదట్లో మైక్రోసాఫ్ట్ 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. అమెజాన్ ఏకంగా 18 వేలమందికి ఉద్వాసన పలికితే, ట్విట్టర్ కూడా వేలాదిమందిని తొలగించింది. 2012లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 60 శాతానికి పైగానే ఉద్యోగులపై వేటేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇక్కడ అవి చేస్తున్న మంచి పనేంటంటే.. మంచి ప్యాకేజీలతో ఉద్యోగులను ఇంటికి పంపడం!