Harsh Goenka: ఇది బ్లూవేల్స్ కు చెందిన 181 కిలోల గుండె
- షేర్ చేసిన పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా
- 1.5 మీటర్ల ఎత్తయిన గుండె, 1.2 మీటర్ల వెడల్పు
- మూడు కిలోమీటర్ల వరకు గుండె కొట్టుకునే శబ్దం
మనుషులను మింగే తిమింగలం అని చెప్పడం వినే ఉంటారు. కానీ, అది అపోహ మాత్రమే. తిమింగలాలు మనుషులను మింగిన దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే తిమింగలాలు భారీ ఆకారంతో ఉన్నప్పటికీ వాటి గొంతు భాగం చాలా చిన్నది. మన పిడికిలి అంత పరిమాణంలోనే ఉంటుంది. భారీ పరిమాణంలోని ఓ తిమింగలం గుండెను శాస్త్రవేత్తలు జాగ్రత్తగా భద్రపరిచారు. 181 కిలోల బరువు ఉన్న గుండెను టొరంటోలోని రాయల్ ఆంటారియో మ్యూజియంలో పదిలపరిచారు. దీనికి సంబంధించిన ఫొటోని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.
ఈ తిమింగలం గుండె ఇప్పటికీ పాడవకుండా భద్రంగా ఉంది. పూర్తిగా పెరిగిన ఓ తిమింగలానికి ఎంత పెద్ద గుండె ఉంటుందో ఈ ఫొటో చూస్తే తెలుస్తుంది. భూమిపై జీవించిన ఉన్న భారీ జీవుల్లో తిమింగాలు కూడా ఒకటి. ‘‘భద్రపరిచిన బ్లూవేల్స్ గుండె ఇది. దీని బరువు 181 కిలోలు. 1.2 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల ఎత్తు ఉంది. ఇది కొట్టుకునే శబ్దాన్ని 3.2 కిలోమీటర్ల దూరం వరకు వినొచ్చు’’ అని హర్ష గోయెంకా ట్వీట్ చేశారు. దేవుడి సృష్టి అద్భుతమని, అద్భుతమైనా నిజమేనని, ప్రకృతే అత్యున్నతమైనదని యూజర్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.